PECET 2025
శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తూ పిల్లల సంపూర్ణ అభివృద్ధికి ఉపయోగపడేవి ఆటలు. ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ, ప్రోత్సాహం అందించడంలో కీలక పాత్ర పోషించేది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లేదా ఫిజికల్ డైరెకర్లు. ఖోఖో, కబడ్డీ వంటి సాంప్రదాయ క్రీడల నుంచి టేబుల్ టెన్నీస్, సర్ఫింగ్ వంటి ఆధునిక క్రీడల్లో మెలుకువలు నేర్పి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేలా చేసేది ఈ టీచర్లే.. దీంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ మరియు ప్రయివేటు విద్యాసంస్థల్లో మంచి డిమాండ్.. ఈ కోర్సు వివరాలు ఈరోజు తెలుసుకుందాం.
కోర్సుల వివరాలు
పీజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణాలో ఇప్పటికే ఉన్నత విద్యామండలి పీఈసెట్ నోటిఫికేషన్ వెలువరించింది.
ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికెట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (సీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ( బీపీఈడీ) మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(ఎంపీఈడీ) అనే ప్రధాన కోర్సులున్నాయి. వీటితో పాటు బీఏ (ఫిజికల్ ఎడ్యుకేషన్), బీఏ (స్పోర్ట్స్ అండ్ ఫర్మార్మెన్స్), ఎంఎస్సీ (స్పోర్ట్స్ మెకానిక్స్), ఎంఎస్సీ (ఎక్సర్‌సైజ్ ఫిజియాలజీ), ఎంఏ (స్పోర్ట్స్ అండ్ ఎక్సైజ్ ఫిజియోలజీ) వంటి ఆధునిక కోర్సులు మార్కెట్లో డిమాండ్ సంతరించుకుంటున్నాయి. పీజీలో ఫిట్‌నెస్ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్ కోచింగ్, ఎక్సర్‌సైజ్ ఫిజియాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, హెల్త్ ఎడ్యుకేషన్, యోగా ఎడ్యుకేషన్ తదితర స్పెషలైజేషన్లున్నాయి.
పీఈసెట్–2025
మన రాష్ర్టంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీఈసెట్) ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (యూజీడీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
డీపీఈడీకి ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత కలిగి 16 ఏళ్లు నిండాలి. బీపీఈడీకి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఇంటర్నేషనల్/ నేషనల్/ ఇంటర్ యూనివర్శిటీ/ స్కూల్ గేమ్స్‌లో పాల్గొని 19 ఏళ్లు పైబడిన వారు అర్హులు.
వీటికి రాత పరీక్ష ఉండదు. ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్, మండల, జిల్లా, రాష్ర్టస్థాయి క్రీడాపోటీల్లో మెరిట్, సర్టిఫికెట్ల ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. రన్నింగ్‌లో 100, 400, 800 మీటర్లు, లాంగ్ జంప్, హైజంప్ వంటి బేసిక్ ఈవెంట్స్‌లో అభ్యర్థి సామర్థ్యం, పరిజ్ఞానాన్ని టెస్ట్ చేస్తారు.
ఎంపీఈడీ కోర్సులో చేరాలంటే బీపీఈడీ ఉత్తీర్ణత కలిగి ఉండి రాష్ర్టంలోని అన్ని యూనివర్శిటీలకు ఉమ్మడిగా నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టస్ట్ (సీపీజీఈటీ) రాయాల్సి ఉంటుంది.
రాష్ర్టవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ఆధ్వర్యంలో పనిచేస్తున్న 21 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో 4 కాలేజీలు డీపీఈడీ (350 సీట్లు) 17 కాలేజీలు బీపీఈడీ (1860 సీట్లు) కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
ఆపర్చునిటీస్
మన దేశంలో టీచర్ కావాలంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) గుర్తింపు పొందిన కోర్సులను మాత్రమే చదవాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ వంటి కోర్సులకు ఈ గుర్తింపు ఉంది. వీటి ద్వారా స్కూల్స్, కాలేజీలు, యూనివర్శిటీల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. టీఎస్పీఎస్సీ నిర్వహించే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్‌గా, జేఎల్, డీఎల్ పరీక్షల ద్వారా జూనియర్ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్‌లు పొందొచ్చు. వీటితో పాటు గురుకుల, మోడల్ స్కూల్స్, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నవోదయ, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ, కేంద్రీయ విద్యాలయాలు ఏటా వేల సంఖ్యలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను నియమించుకుంటాయి. వీటితో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే స్పోర్ట్స్ స్కూల్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్), రాష్ట్ర క్రీడా సాధికారిత సంస్థలు, అకాడమీల్లో ఇన్స్ర్టక్టర్లు, అడ్వైజర్స్, కోచ్, ఫిజికల్ ట్రైనర్లుగా స్థిరపడొచ్చు. ప్రైవేటు స్కూళ్లు, స్పోర్ట్స్ అకాడమీలు, ఫిట్‌నెస్ సెంటర్లు, మల్టినేషనల్ కంపెనీలు, కార్పొరేట్ ఆఫీసుల్లోనూ దాదాపు ఇవే అవకాశాలుంటాయి. సొంతంగా అకాడమీలు, హెల్త్ క్లబ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు నిర్వహించవచ్చు.
జాబ్ ప్రొఫైల్స్
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
ఫిజికల్ డైరెక్టర్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్
స్పోర్ట్స్ కోచ్
స్పోర్ట్స్ మేనేజర్
ఫిజికల్థెరపిస్ట్
ఫిట్‌నెస్ ఇన్‌స్ర్టక్టర్
స్పోర్ట్స్ జర్నలిస్ట్
హెల్త్ ఎడ్యుకేటర్
స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్
టీచింగ్ అర్హతలు
ప్రైమరీ/అప్పర్ ప్రైమరీ (1 నుంచి 8వ తరగతి వరకు): కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ లో రెండేళ్ల డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సులో ఉత్తీర్ణత తప్పనిసరి. స్కూల్/కాలేజ్/డిస్ట్రిక్ లెవెల్‌లో క్రీడలు/ఆటల్లో పాల్గొని ఉండాలి.
సెకండరీ (9 -10 తరగతులకు): కనీసం 50 శాతం మార్కులతో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎలెక్టివ్‌గా డిగ్రీ ఉత్తీర్ణత. లేదా 45 శాతం మార్కులతో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎలెక్టివ్‌గా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు జాతీయ, రాష్ట్ర మరియు అంతరాష్ట్ర స్థాయిలో క్రీడలు/ఆటల్లో పాల్గొని ఉండాలి. లేదా కనీసం 40 శాతం మార్కులతో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ / మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ ఉత్తీర్ణత.
సీనియర్ సెకండరీ (ఇంటర్): కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీఈపీడీ) లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈ) కోర్సులో ఉత్తీర్ణత లేదా హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బీఎస్సీ / 55 శాతం మార్కులతో స్పోర్ట్స్ లో డిగ్రీ పాసవ్వాలి. లేదా 50 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీఈపీడీ) లేదా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీఈపీడీ) డిగ్రీ ఉత్తీర్ణత. మరియు రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ) లో ఉత్తీర్ణత తప్పనిసరి.
లెక్చరర్/ప్రొఫెసర్: డిగ్రీ కాలేజీలు, యూనివర్శిటీల్లో లెక్చరర్ లేదా ప్రొఫెసర్ అవ్వాలంటే ఎంపీఈడీతో పాటు రాష్ర్ట ప్రభుత్వాలు నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా కేంద్రం నిర్వహించే నెట్ క్వాలిఫై అవ్వాలి.
తెలుగు రాష్ర్టాల్లో పీఈటీ కోర్సులు అందించే యూనివర్సిటీలు
ఉస్మానియా యూనివర్శిటీ
కాకతీయ యూనివర్శిటీ
ఆంధ్రా యూనివర్శిటీ
శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ
యోగి వేమన యూనివర్శిటీ
కరిక్యులమ్
ప్రిన్సిపుల్స్, ఫిలాసపీ అండ్ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ర్టేషన్, మెజర్మెంట్ అండ్ ఎవల్యూషన్, సైకాలజీ, మెటీరియల్స్ అండ్ మెథడ్స్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, అనాటమీ, ఫిజియోలజీ, కినెసియోలజీ అండ్ బయోమెకానిక్స్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సేఫ్టీ ఎడ్యుకేషన్, ఫిజియోలజీ ఆఫ్ ఎక్సర్‌సైజ్, అఫీషియేటింగ్ అండ్ కోచింగ్, ఒలింపిక్ మూవ్మెంట్, రిక్రియేషన్ అండ్ లీజర్ మేనేజ్‌మెంట్, కాన్సెప్ట్స్ ఆఫ్ వెల్నెస్ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్ ఫిజియోలజీ అండ్ సోషియోలజీ, స్పోర్ట్స్ మెడిసిన్, ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, కాన్సెప్ట్స్ ఆఫ్ యోగా, రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. పీజీలో ఆయా క్రీడాంశాల్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆసక్తి ఉంటే ఎంఫిల్, పీహెచ్డీ చేసే అవకాశమూ ఉంది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) క్వాలిఫై అయి జూనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరొచ్చు.
యూజ్‌ఫుల్ వెబ్‌సైట్స్
www.pecet.tgche.ac.in
www.tgcpget.com
www.tgpsc.gov.in
www.telanganaset.org
www.lnipe.edu.in
www.tnpesu.org
www.nsnis.org