Pilot training course: ఫైలట్​ ట్రైనింగ్​ కోర్సు..పూర్తి వివరాలు

Pilot training course

రోడ్డుపై నడిచే టూ వీలర్​, త్రివీలర్​, హెవీ మోటార్​ లైసెన్స్​లు పొందడం అందరికీ తెలుసు.. మరి గాలిలో ఎగిరే విమానం నడిపే ఫైలట్​ల సంగతేంటి.. వారికి లైసెన్స్​ ఉంటుందా? విమానం నడపాలంటే అర్హతలేంటి? ఫైలట్​ కావాలంటే ఏం చేయాలి?.. ఫైలట్​ కోర్సులు అందించే అకాడమీలు ఎక్కడెక్కడ ఉన్నాయి?.. కోర్సు చదివితే.. ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయో పైలట్​ కోర్సు కెరీర్​ గురించి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం….
పైలట్‍ గా కెరీర్‍ ప్రారంభించాలనుకునే వారు ముందుగా తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం పైలెట్‍ లైసెన్స్. ఇందులో మూడు రకాలుంటాయి. అవి స్టూడెంట్ పైలట్ లెసైన్స్, ప్రైవేట్ పైలట్ లెసైన్స్, కమర్షియల్ పైలట్ లెసైన్స్. ఇన్‌స్టిట్యూట్‌లు ప్రత్యేకంగా సెలెక్షన్‍ టెస్టులు నిర్వహించి ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. నిర్ధిష్ట అకడమిక్‍ సంవత్సరం ఉండదు కాబట్టి వీటికి సంవత్సరం పొడవునా ప్రవేశాలు జరుపుతారు. మరి పైలట్‍ లైసెన్స్ తీసుకోవాలంటే ఆయా దశల్లో డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‍ నిర్వహించే థియరీ పరీకల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ఏటా జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్‌లలో ఈ పరీక్షలు జరుగుతాయి.

కావాల్సిన నైపుణ్యాలు pilot course skills

శారీరక, మానసిక దృఢత్వంతో పాటు సాంకేతిక అంశాలపై సునిశిత పరిశీలన చేయగలిగే నైపుణ్యం ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో సమయ స్ఫూర్తితో వ్యవహరించగలగాలి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, హైజాక్‌లు వంటి ఊహించని సవాళ్లను ఎదర్కొనే మానసిక స్థ్యైర్యం కలిగి ఉండాలి. అన్నింటికి మించి ఒత్తిడి తట్టుకొని రోజుల తరబడి పనిచేసే ఓపిక ఉండాలి.

స్టూడెంట్ పైలట్ లెసైన్స్


పైలట్‍ కెరీర్లో మొదటిది స్టూడెంట్‍ పైలట్‍ లైసెన్స్ దశ. ఈ దశలో విమానయానానికి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం, ఎయిర్‌క్రాఫ్ట్, ఇంజిన్స్, ఏరోడైనమిక్స్ వంటి సబ్జెక్టుల థియరీని బోధిస్తారు. ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. స్టూడెంట్ పైలట్ లెసైన్స్ కోర్సులో చేరాలంటే కనీసం పదోతరగతి పాసవ్వాలి. 16 ఏళ్లకు తక్కువ ఉండరాదు. డీజీసీఏ నిర్వహించే రెండు పరీక్షల్లో పాసయితేనే కోర్సు ఉత్తీర్ణులయినట్లు. ఈ లైసెన్స్ పొందిన వారు విద్యార్థిగా విమానాలు నడపడానికి అర్హులవుతారు.


ప్రైవేట్ పైలట్ లెసైన్స్:


స్టూడెంట్‍ పైలట్‍ లైసెన్స్ పాసయిన వారు రెండో దశలో ఉండే ప్రైవేటు పైలట్‍ లైసెన్స్ కోర్సు చదవాలి. 17 ఏళ్లు నిండి 10+2 ఉత్తీర్ణులయినవారు (మ్యాథ్స్, ఫిజిక్స్) నేరుగానే ఈ కోర్సులో చేరొచ్చు. ఇది పూర్తవడానికి దాదాపు 18 నెలల సమయం పడుతుంది. ఇందులో కూడా థియరీ, ప్రాక్టికల్స్ ఉంటాయి. థియరీలో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్, ఎయిర్ నేవిగేషన్, ఏవియేషన్ మెటీయరాలజీ, సీమన్‌షిప్ వంటి సబ్జెక్టులుంటాయి. ప్రాక్టికల్స్ లో విద్యార్థులు ఇన్‌స్ట్రక్టర్ సహాయంతో 40 గంటలు, స్వయంగా 20 గంటల పాటు విమానాన్ని నడపాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్ పొందిన వారు ప్రైవేటు ఎయిర్‍క్ర్టాఫ్ట్ ను ఎటువంటి వేతనం లేకుండా నడపడానికి అర్హులవుతారు. కమర్షియల్‍ పైలట్‍ కోర్సు చేయాలంటే ఇందులో ఉత్తీర్ణత తప్పనిసరి.


కమర్షియల్ పైలట్ లెసైన్స్


పైలట్‍ కెరీర్‍ క్రమంలో కీలకమైన దశ కమర్షియల్ పైలట్ లెసైన్స్. దీనికి ఇంటర్మీడియట్‍ (మ్యాథ్స్, ఫిజిక్స్) ఉత్తీర్ణులవ్వాలి. 18 సంవత్సరాల వయసు నిండాలి. దీని శిక్షణ కాలం విద్యార్థి, ఇన్‍స్టిట్యూట్‍ల సామర్థ్యాన్ని బట్టి ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు ఉండొచ్చు. థియరీలో ఎయిర్ రెగ్యులేషన్స్, ఏవియేషన్ మెటీయరాలజీ, ఎయిర్ నేవిగేషన్, టెక్నికల్ ప్లానింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ రేడియో అండ్ వైర్‌లెస్ ట్రాన్స్‌మిషన్ వంటి సబ్జెక్టులుంటాయి. ప్రైవేటు పైలట్‍ లైసెన్స్ దశలో పొందిన 60 గంటలతో పాటు మొత్తం 250 గంటల ప్లయింగ్‍ శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది ఇన్‍స్ర్టక్టర్ల సాయంతో నడుస్తుంది. దీంతో పాటు 200 గంటలు స్వయంగా నడపాలి. డీజీసీఏ పరీక్షల్లో ఉత్తీర్ణులయిన వారికి మాత్రమే కమర్షియల్‍ పైలెట్‍ లైసెన్స్ ఇస్తారు. ఈ అర్హత సాధిస్తే కమర్షియల్‍ గా ఎటువంటి విమానాలనైనా నడపవచ్చు.


ఫీజుల వివరాలు pilot course cost telugu


అత్యధికంగా ఖర్చవుతున్న కోర్సుల్లో పైలట్‍ కోర్సు కూడా ముందు వరుసలో ఉంటుంది. ఈ కోర్సు చేయడానికి ఇన్‍స్టిట్యూట్‍ ను బట్టి కనీసం 10 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చవుతుంది. హైదరాబాద్‍ లోని రాజీవ్‍ గాంధీ ఏవియేషన్ అకాడమీలో కమర్షియల్‍ పైలట్‍ లైసెన్స్ కోర్సు చేయాంటే దాదాపు 20 లక్షలు అవుతుంది. చాలా సంస్థలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొని రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నాయి.
టాప్‍ ఇన్‍స్టిట్యూట్‍లు
పైలట్‍ ట్రైనింగ్‍ కోర్సును నిర్వహించే సంస్థలను ఫ్లైయింగ్‍ క్లబ్‍లు అంటారు. వీటిని నిర్వహించాలంటే డైరెక్టర్‍ జనరల్‍ ఆఫ్‍ సివిల్‍ ఏవియేషన్‍ (డీజీసీఏ) తప్పనిసరి. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 29 ఇన్‍స్టిట్యూట్‍లు, ఫ్లయింగ్ క్లబ్‌లు పైలట్ లెసైన్స్ శిక్షణ అందిస్తున్నాయి.

ఇన్‍స్టిట్యూట్‍ వెబ్‍సైట్‍ pilot course institues in india


రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ-హైదరాబాద్ www.rgaviation.com
ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ-హైదరాబాద్ www.flytechaviation.com
ఫ్లై ఎయిర్ ఏవియేషన్ అకాడమీ www.flyairaviationacademy.in
ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ www.apaviationacademy.in
ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ www.apft.edu.in
ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ www.igrua.gov.in
అహ్మదాబాద్ ఏవియేషన్ అండ్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ www.aaa.co.in
గుజరాత్ ఫ్లైయింగ్ క్లబ్ www.gujaratflyingclub.org
రాజీవ్‌గాంధీ అకాడమీ ఆఫ్ ఏవియేషన్ టెక్నాలజీ-కేరళ www.rgaviation.com
గవర్నమెంట్ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్-భువనేశ్వర్ www.flywithgati.com
బాంబే ఫ్లైయింగ్‍ క్లబ్‍ http://www.thebombayflyingclub.com

కెరీర్‍ అవకాశాలు pilot job opportunities


డీజీసీఏ అంచనాల ప్రకారం విమానయాన రంగం ఏటా దాదాపు 25 శాతం వృద్ధిని సాధిస్తుండటంతో పైలట్‍ కోర్సు చేసినవారికి దేశ విదేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్‍లైన్స్ సంస్థల్లో ఎన్నో ఉద్యోగావకాశాలున్నాయి. కమర్షియల్‍ పైలట్ లైసెన్స్ పరీక్ష పాసయిన వారికి మొదట ట్రైనీ పైలట్‍ గా అపర్చునిటీస్‍ లభిస్తాయి. ఈ దశలోనే దాదాపు 40 నుంచి 50 వేల దాకా వేతనాలు అందుకోవచ్చు. అనంతర కాలంలో గడించిన అనుభవం ఆధారంగా (కనీసం 4 వేల గంటలు) ఫస్ట్ ఆఫీసర్‍(జూనియర్‍, సీనియర్‍) హోదా, కో పైలట్.. అనతికాలంలో చివరిదైనా కమాండర్‍ స్థాయికి చేరొచ్చు. ఈ దశలో అత్యధింకగా నెలకు 5 లక్షలు పైగా వేతనం పొందుతున్న వారున్నారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఇండిగో ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్‌వేస్, స్పైస్ జెట్, బోయింగ్‍ వంటి ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ (ప్రయాణికుల విమానాలు)లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వీటిలో పనిగంటలు ఎక్కువగా ఉంటాయి. చార్టర్స్ ఫ్లైట్‍ (వ్యక్తిగత విమానాలు), కార్గో విమానాలు (సరకు రవాణా విమానాలు) కోస్ట్‌గార్డ్, కార్పేరేట్‍ ఫ్లైయింగ్‍, డిఫెన్స్, ఎయిర్‍ఫోర్స్, నేవీ, హిందుస్తాన్‍ ఏరోనాటిక్స్ లిమిటెడ్‍ వంటి వాటిలోనూ జాబ్‍లు దొరుకుతాయి. వీటిలో తక్కువ పనిగంటలు ఉంటాయి. ఇవే కాకుండా ఫ్లైయింగ్ క్లబ్బుల్లో ఇన్‌స్ట్రక్టర్‌గానూ పనిచేయవచ్చు.

ఫైలట్​ కెరీర్​– సవాళ్లు

పైలట్‍ కెరీర్‍లో అనుకూలతలు, ప్రతికూలతలు రెండూ ఉంటాయి. ప్రయాణాలంటే ఆసక్తి ఉన్న వారికి ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టి వచ్చే అవకాశం ఉంది. ఐదంకెల జీతం, విలాసవంతమైన జీవితం దీని సొంతం. జాబ్‍లో హుందాతనం, సమాజంలో గౌరవం వంటివి మెండుగా లభిస్తాయి. అయితే రోజుల తరబడి ప్రయాణాలు చేయాల్సి రావడం, విభిన్న వాతావరణాల్లో తిరగడంతో ఆరోగ్యంపై ప్రభావం, ఎక్కువ పనిగంటలతో కుటుంబంతో గడిపే సమయం తక్కువగా ఉండటం వంటి ప్రతికూలతలున్నాయి. ముఖ్యంగా ఏ చిన్న సాంకేతిక లోపం తలెత్తినా భారీ విధ్వంసం జరగడం, హైజాక్‍, బాంబుదాడులు వంటి ఆపత్కాలంలో సమయస్పూర్తిగా వ్యవహరించడం వంటి సవాళ్లు ఉన్నాయి. వీటిన్నింటికి మానసిక స్థ్యైర్యం ఉండాలి.

Leave a Comment