study in germany for indian students
ఇన్నోవేషన్, సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్‍మెంట్, రియల్ టైం టీచింగ్‍కు జర్మనీ పెట్టింది పేరు. అత్యధిక నోబెల్ అవార్డు గ్రహీతలు ఉన్న దేశాల్లో టాప్ 3 లో ఉందంటే అక్కడి విద్యా విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అటోమొబైల్, శాస్ర్తసాంకేతిక రంగాల్లో ఆ దేశం సాధించిన విజయాలే ఇందుకు తార్కాణం. ఇతర ఏ దేశంలో లేని విధంగా విదేశీ విద్యార్థులకు ఉచిత విద్యనందించడం అక్కడి యూనివర్శిటీల ప్రత్యేకత. కోర్సు పూర్తయిన తర్వాత లాంగ్ స్టే ద్వారా అక్కడే ఉద్యోగం చేసుకునే వెసులుబాటూ ఉంటుంది. అందుకే అన్ని దేశాల విద్యార్థుల కలల సాధనకు వేదికగా మారుతోంది జర్మనీ. మన విద్యార్థుల సంఖ్యా క్రమంగా పెరుగుతోంది.
అంతర్జాతీయ విద్యార్థులను జర్మనీలో ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం ఉచిత విద్య. అక్కడి యూనివర్శిటీలు చదువు చెప్పటానికి ఎటువంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయవు. ఒక వేళ చేసినా వర్శిటీని బట్టి దాదాపు లక్ష లోపే ఉంటుంది. అడ్మిషన్, స్టూడెంట్ యూనియన్ ఫీజు, నివాస, రవాణా ఖర్చులు వంటివి విద్యార్థులు భరించాల్సి ఉంటుంది. ఇవి కూడా పార్ట్‌టైం జాబ్స్ ద్వారా సమకూర్చుకునే అద్భుత అవకాశం ఉంది. ఇక్కడి కోర్సులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండటంతో ఐరోపా కేంద్రంగా పని చేస్తున్న టాప్ రిక్రూటర్స్ కూడా అమెరికా, యూకే కంటే జర్మనీలో చదివిన వారికే విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయి.
టాప్ 5 యూనివర్శిటీలు
టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ టాప్ 200 లో జర్మనీకి చెందినవి 20 వర్శిటీలు చోటు దక్కించుకున్నాయి. క్యూఎస్ వర్‌ల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్‌లోనూ దాదాపు 15 వర్శిటీలు టాప్ 200 లో నిలిచాయి.
వర్శిటీ టైమ్స్ క్యూఎస్
లడ్‌విగ్ మాక్స్‌మిలియన్స్ యూనివర్శిటీ, మునిచ్ 32 62
టెక్నికల్‍యూనివర్శిటీ ఆఫ్ మునిచ్ 44 61
హిడెల్‍బర్గ్ యూనివర్శిటీ 47 64
హంబోల్ట్ యూనివర్శిటీ ఆఫ్ బెర్లిన్ 67 121
యూనివర్శిటీ ఆఫ్ ఫ్రీబర్గ్ 76 186
జర్మనీ వీసా ప్రాసెస్
జర్మనీలో అకడమిక్ ప్రవేశాలు ప్రధానంగా వింటర్, సమ్మర్ సీజన్ అని రెండు రకాలుగా ఉంటాయి. ఏటా అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉండే వింటర్ సీజన్ సెమిస్టర్ కు కనీసం ఆరునెలలు ముందు నుంచే ప్రవేశ ప్రయత్నాలు చేయాలి. ఈ సీజన్‍కు చివరితేది జూలై 15. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఉండే సమ్మర్ సీజన్‍కు జనవరి 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు కావాల్సిన సమాచారాన్ని ఇంటర్నెట్, బ్రోచర్లు వంటి వాటి నుంచి సేకరించుకోవాలి. www.daad.in వెబ్‍సైట్‍లోనూ ఈ సమాచారం పొందొచ్చు.
ముందు ఆసక్తి ఉన్న యూనివర్సిటీ వెబ్‍సైట్ సందర్శించి విద్యార్హతలు, ఫీజు, కోర్సు వ్యవధి వంటి వివరాలు తెలుసుకోవాలి. అనంతరం వెబ్‍సైట్లో పేర్కొన్న విధంగా దరఖాస్తు చేసుకోవాలి. లేదా యూని అసిస్టెంట్ అనే వెబ్‍సైట్‍లో అప్లై చేస్తే వారే మీరు కోరుకున్న వర్శిటీలకు పంపిస్తారు. అప్లికేషన్ అమోదం పొంది అడ్మిషన్ కన్ఫర్మ్ అయితే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జర్మన్ ఎంబసీ వెబ్‍సైట్ చూడటం వల్ల వీసా విధానం గుర్తించి పూర్తి వివరాలు తెలుస్తాయి. జర్మనీలో అడుగుపెట్టిన మూడు నెలల్లోపు ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసు నుంచి రెసిడెన్స్ పర్మిట్ పొందాల్సి ఉంటుంది.
డాక్యుమెంట్స్
అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్
అకడమిక్ సర్టిఫికెట్స్
స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్
ఆర్థి్క ధ్రువీకరణ పత్రాలు
స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ లెటర్
పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్
పాపులర్ కోర్సులు
జర్మనీలో చదువుతున్న అధికమంది ఇండియన్ స్టూడెంట్స్ మెకానికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులను ఎంచుకుంటున్నారు. తర్వాత దశలో సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ర్టానిక్స్ అండ్ ఫార్మసీ, బయో సెన్సైస్, టెక్నాలజీ వంటి కోర్సులను చదువుతున్నారు. అలాగే జర్మనీలో హెల్త్, మెకానికల్ అండ్ ఆటోమోటివ్ సెక్టార్, ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ర్టానిక్స్, బిల్డింగ్ అండ్ కన్‍స్ర్టక్షన్, ఐటీ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ వంటి జాబ్ సెక్టార్‍లు ప్రాచుర్యం పొందాయి.
విద్యార్హతలివి

జర్మనీలో రీసెర్చ్ ఓరియంటేషన్‍తో బోధించే టెక్నికల్ విశ్వవిద్యాలయలు, పారిశ్రామిక శిక్షణపై దృష్టి సారించే అప్లైడ్ సైన్సెస్ వర్శిటీలు అని రెండు రకాలుగా ఉంటాయి. ఇవి అటానమస్ హోదా కలిగి ఉంటాయి కాబట్టి ప్రతి వర్శిటీ అడ్మిషన్ నిబంధనలు సొంతంగా రూపొందించుకుంటుంది. కాబట్టి మీరు చదవాలనుకున్న వర్శిటీ వెబ్‍సైట్ సందర్శించి ప్రవేశ వివరాలు తెలుసుకోవచ్చు. మీరు చదివిన కోర్సుకు జర్మనీలో గుర్తింపు ఉందో లేదో డీఏఏడీ ఎంట్రన్స్ క్వాలిఫికేషన్ డేటాబేస్ ద్వారా తెలుసుకోవచ్చు.
బ్యాచిలర్ డిగ్రీల్లో చేరాలంటే 10+2 తత్సమాన అర్హత ఉండాలి. ఐఈఎల్‍టీఎస్ 6.0 స్కోరు ఉండాలి. మాస్టర్స్ కోర్సుల్లో ఎంఎస్‍కు ఐఈఎల్‍టీఎస్ 6.5, టోఫెల్ స్కోర్ అయితే 80 ఉంటే సరిపోతుంది. కొన్ని కోర్సులకు జీఆర్‍ఈ స్కోర్ కూడా అనుమతిస్తారు. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ తప్పనిసరి. ఇందుకు గాను ఐఈఎల్‍టీఎస్ 6.5, టోఫెల్ అయితే 87 ఉండాలి.
అక్కడి చట్టాల ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు వారానికి 20 గంటల పాటు పార్ట్‌టైం వర్క్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఫుల్‍టైం అయితే సంవత్సరానికి 120 రోజులు దాటవద్దు. గతంలో 90 రోజులు మాత్రమే అనుమతించేవారు. చేసే జాబ్ అకడమిక్ స్టడీస్‍కు సంబంధించినది అయితే యూనివర్శిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి అనుమతి సులువుగా లభిస్తుంది. సాధారంణంగా ట్యూటర్స్, బార్ టెండర్స్, అడ్మినిస్ర్టేటివ్ స్టాఫ్స్, కిడ్స్ అండ్ ఎల్డర్స్ కేర్‍టేకర్ వంటి పార్ట్‌టైం ఉద్యోగాలు ఉంటాయి. గంటకు 5 నుంచి 15 యూరోల మధ్య చెల్లిస్తారు. కాబట్టి సంవత్సరానికి 8 నుంచి 10 వేల యూరోల వరకు సంపాదించుకోవచ్చు. దీని వల్ల ఇండిపెండెన్సీ పెరగడంతో పాటు అక్కడి భాష నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. తద్వారా భవిష్యత్‍లో స్థిరపడాలనుకునే వారికి అదనపు అర్హత అవుతుంది. కొన్ని యూనివర్శిటీలు చదువుకుంటుండగానే ఈ సౌకర్యం కల్పించగా మరి కొన్ని సెలవుల్లో మాత్రమే అనుమతిస్తాయి.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తవగానే 18 నెలలపాటు పోస్ట్ స్టడీ వర్క్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కోర్సు పూర్తయిన వారు వారానికి 40 గంటల ఫుల్‌టైమ్ పోస్ట్ స్టడీవర్క్ చేయవచ్చు. జర్మనీ వర్శిటీలు అంతర్జాతీయ విద్యార్థులకు 4-6 నెలల ఇంటర్న్‌షిప్‌ను కల్పించడం ద్వారా వారు ఉద్యోగ పరిజ్ఞానం పెంచుకొని, అధిక ఉద్యోగావకాశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తాయి.
జర్మనీలో ప్రవేశించిన వారు అక్కడికి వెళ్లాక జర్మన్ లాంగ్వేజ్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. ముందుగానే నేర్చుకొని వెళ్లడం వల్ల చాలా ప్రయోజనముంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్లాక అక్కడి ప్రజలతో సత్సంబంధాలు మెయింన్‍టెన్ చేయాలన్నా, మీ కోర్సును విజయవంతంగా పూర్తి చేయాలన్నా భాష కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా డిగ్రీ కోర్సుల్లో ఎక్కువ శాతం జర్మన్‍లోనే బోధిస్తారు.
స్కాలర్‍షిప్‍లు సదపాయం
జర్మనీలో చదవాలనుకునే విద్యార్థులకు యూనివర్శిటీ ఫండెడ్, గవర్నమెంట్ ఫండెడ్, నాన్ గవర్నమెంట్ ఫండెడ్ వంటి మూడు రకాల స్కాలర్‍షిప్‍లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో డీఏఏడీ, ఎరాస్మస్ ప్లస్ వంటి గవర్నమెంట్ ఫండెడ్ స్కాలర్‍షిప్‍లతో పాటు హెన్రిచ్ బోల్ స్కాలర్‌షిప్స్, హమ్‌బోల్ట్ రీసెర్చ్ ఫెలోషిప్స్, కొన్రడ్-అడెన్యుయర్-స్టిఫ్టుంగ్, బేయర్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్, ఒట్టో బేయర్ స్కాలర్‌షిప్ వంటి నాన్ గవర్నమెంట్ ఫండెడ్ స్కాలర్‍షిప్‍లుంటాయి. బ్రెమెన్ ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషియల్ సెన్సైస్, ఫ్రాంక్‌ఫర్ట్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్ డాక్టోరల్ ట్యూషన్ వీవర్స్, ఫ్రైస్ కోఫండ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ వంటి యూనివర్శిటీ స్పెసిఫిక్ స్కాలర్‍షిప్‍లుంటాయి.